తెలంగాణ రాష్ట్రం రాకుంటే మరో బీహార్‌లా మారి, వలసలతో వల్లకాడు అయ్యేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో 174 మంది ముస్లిం మైనార్టీలకు వందశాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరువు కాటకాలు విలయతాండవం చేయగా, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేని దుస్థితి నెలకొని ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనతో సస్యశ్యామలంగా మారిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెజాన్, గుగూల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, యువతకు తెలంగాణ రాష్ట్రం ఉపాధి హబ్‌గా మారబోతున్నదన్నారు.
అలాగే, 10వ తేదీన హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే బీసీల సింహ గర్జన పోస్టర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సింహగర్జనను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపు ఇచ్చారు.