జీ20 వేడుక కోసం దేశ రాజధాని దిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈనెల 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో అట్టహాసంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా 40కి పైగా దేశాల అధినేతల హాజరవనున్నారు. దేశాధినేతల రాక సందర్భంగా దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాల పహారా కాస్తున్నాయి. ట్రాఫిక్, శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లో 40 వేల మంది సిబ్బంది ఉన్నారు. డ్రోన్ దాడులు తిప్పి కొట్టే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. డమ్మీ పేలుడు పదార్థాలపై శునకాలతో డ్రిల్స్ నిర్వహించారు. యమునా నదిలోనూ పడవలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
దిల్లీ కర్తవ్యపథ్, ఇండియా గేట్, కీలక ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాజధాని నగరంలో మెట్రో రైళ్లు, విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యా సంస్థలు, కార్యాలయాలు, ఆహార సరఫరా సంస్థల సేవలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 8-10 వరకు విద్యాసంస్థలు, కేంద్ర కార్యాలయాలకు సెలవులను ప్రకటించారు.