సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయానిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిపై హిందూ సంఘాలు, బిజెపి నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆపేది లేదని ఉదయనిధి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. అయితే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టలిన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలికారు ప్రముఖ నటుడు సత్యరాజ్. సనాతన ధర్మంపై ఉదయనిది స్పష్టంగా మాట్లాడారని.. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు అభినందిస్తున్నానని తెలిపారు. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యాచరణ, వ్యవహారశైలి పట్ల గర్విస్తున్నానని అన్నారు కట్టప్ప.