ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు రవీందర్.. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన షాయినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవీందర్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోం గార్డుల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరూ రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. హోం గార్డులు డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా విధులకు రాకపోతే వాళ్లను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.