ఈనెల 17వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల అనంతరం వీరంతా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ సభలో సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక, ఖర్గేలు ప్రసంగించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ఆరు ప్రధాన హామీల గ్యారెంటీ పత్రాన్ని విజయభేరి సభలో సోనియా విడుదల చేయనున్నారు.
అయితే ఇదే సభలో పలువురు రాష్ట్ర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే చేరికలపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. విజయ భేరి సభలో చేరికలు ఉండవని రాష్ట్ర కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సభ కేవలం గ్యారెంటీల ప్రకటన కోసమేనని చెప్పింది. కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడే హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఇందులో భాగంగా ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. సాయంత్రం ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. హస్తం తీర్థం పుచ్చుకున్న తర్వాత తుమ్మల.. ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంకను కలవనున్నట్లు తెలిసింది. అదే విధంగా ఇవాళ సాయంత్రం సోనియాతో షర్మిల భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.