విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌.. ఉద్యోగ దరఖాస్తులకు రూ.5.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలివే!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ఓటర్లపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఇప్పుడు తన మేనిఫెస్టోతో మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో.. కాలేజీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే హామీ ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తోంది. అంతే కాకుండా నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే రుసుమును రూ.5 లేదా రూ.10 పెట్టాలన్న విషయం పైనా యోచిస్తోంది. ఎన్నికల మేనిఫెస్ట్ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పలు హామీలపై చర్చించారు.

రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో నష్టపోతున్న ప్రజలకు, విద్యార్థులకు, యువత సంక్షేమానికి పెద్దపీట వేసేలా తమ మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకు అక్టోబరు 2వ తేదీన ఉదయం ఆదిలాబాద్‌లో, సాయంత్రం నిజామాబాద్‌ జిల్లాల్లో పర్యటించాలని కమిటీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news