దసరా స్పెషల్.. ఈనెల 13 నుంచి 5265 ప్రత్యేక బస్సులు

-

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 5వేల 265 ప్రత్యేక బస్సులు నడిపించేందుకు సన్నద్ధమైంది. అక్టోబరు 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ బస్సులు నడిపించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్​లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్​బీ కాలనీ, ఉప్పల్‌  క్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్- ఉప్పల్‌, ఎంజీబీఎస్- జేబీఎస్, ఎంజీబీఎస్- ఎల్బీనగర్‌ మార్గాల్లో పది నిమిషాలకో సిటీ బస్సు తిరుగుతుందని వెల్లడించారు.

సద్దుల బతుకమ్మ, మహర్నవమి, దసరాకు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సజ్జనార్ చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 21 నుంచి 23 వరకు రెగ్యులర్‌, స్పెషల్‌ సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నడవనున్నట్లు వివరించారు.

ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, ఒంగోలు వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి వెళ్లనున్నాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ బస్సులు జేబీఎస్, పికెట్‌ నుంచి వెళ్తాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, తొర్రూరు, యాదగిరి గుట్ట బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి నడుస్తాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్‌ నుంచి వెళ్లనుండగా మిగతా సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి బయల్దేరతాయి.

Read more RELATED
Recommended to you

Latest news