మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. టపాచులా నగరంలోని ఓ రహదారిపై ఆదివారం రోజున ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా వలస కూలీలేనన.. అమెరికా సరిహద్దు వైపుగా వెళుతున్నట్లు సమాచారం. గ్వాటెమాల దేశానికి 175 కిలో మీటర్లు దూరంలో ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
“సమాచారం అందగానే మేం ఘటనాస్థలికి చేరుకున్నాం. వెంటనే సహాయక చర్యలు చేపట్టాం. కానీ అప్పటికే ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో 15 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించాం. ప్రమాదం బారిన పడిన వారంతా వలస కూలీలు అని తెలిసింది. వారంతా అమెరికా సరిహద్దు వైపు వెళ్తున్నారు. అయితే బాధితులు ఏ దేశానికి చెందిన వారో మాత్రం ఇంకా తెలియలేదు. ఈ విషయంపై ఆరా తీస్తున్నాం. ఇక్కడి ఓ వ్యక్తి మాత్రం వారంతా క్యూబాకు చెందిన వారని చెబుతున్నారు. ఆ విషయంపై ఆరా తీస్తున్నాం.” అని అక్కడి ఓ అధికారి తెలిపారు.