సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సాయంత్రం నాలుగు గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం… 5 గంటల 15 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరతారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వేళ బీఆర్ఎస్ మొట్టమొదటి భారీ బహిరంగ సభ కావడంతో సుమారు లక్ష మందితో జన సమీకరణ చేసిసభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభలో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి సభకు వచ్చే ప్రజలను కోసం 55 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో సభా స్థలం పక్కనే ఉన్న హుస్నాబాద్- కరీంనగర్, కరీంనగర్- హుస్నాబాద్ మార్గంలో వెళ్లే ట్రాఫిక్‌ను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు దారి మళ్లించనున్నారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే వాహనాలు నాగారం – మహ్మదాపూర్ – బొమ్మనపల్లి – సుందరగిరి నుంచి – కరీంనగర్‌కు వెళ్లనుండగా.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలు.. సుందరగిరి-బొమ్మనపల్లి- మహ్మదాపూర్ – నాగారం మీదుగా హుస్నాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.