ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దారుణ యుద్ధానికి ప్రతీకారంగా హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలని ఆ దేశం ప్రతిజ్ఞ పూనింది. ఈ క్రమంలోనే గాజాపై భీకర దాడులకు పూనుకుంది. గాజాపై వైమానిక దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో పాలస్తీన ప్రజలు పిట్టల్లా ప్రాణాలొదులుతున్నారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు మృతి చెందుతున్నారు. తమ ఆత్మీయులు చనిపోయారని కనీసం కన్నీరు పెట్టుకునే సమయం కూడా తమ ప్రజలకు ఇవ్వకుండా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోందని పాలస్తీనా ప్రతినిధులు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా పాలస్తీనా ప్రతినిధి తన ఆవేదన వెల్లబోసుకుంటూ.. తమ దేశ పౌరులపై జరుగుతున్న దాడులను ప్రపంచం ఎదుటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. పాలస్తీనా వాసుల హత్యలకు.. ఇజ్రాయెల్ ప్రజల హత్యలు సమాధానం కాదని.. అలానే ఇజ్రాయెల్ పౌరుల హత్యలకు పాలస్తీనా ప్రజలను చంపడం జవాబు కాదని పాలస్తీనా ప్రతినిధి ఐరాస సభలో తెలిపారు. కానీ, కొందరు ఇజ్రాయెల్ వాసుల కోసం ఎక్కువ బాధపడతారని.. తమ బాధ ఎవరికీ కనిపంచడం లేదని వాపోయారు. కన్నీరు పెట్టుకోవడానికీ తమ ప్రజలకు సమయం లేదని అన్నారు.