బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు తరచూ విమర్శల సెగ తగులుతోంది. తాజాగా ఆయనపై మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సుయెల్లా బ్రేవర్మన్ విమర్శన లేఖాస్త్రాన్ని సంధించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు సుయెల్లా బ్రేవర్మన్‌ను హోం మంత్రి పదవి నుంచి రిషి సునాక్ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాసిన లేఖలో రిషి సునాక్‌పై ఘాటు విమర్శలు చేశారు. సునాక్‌కు ఎవ్వరూ మద్దతు ఇవ్వని సమయంలో తాను మద్దతుగా నిలిచానని అయినా ఆయన తనను పదవి నుంచి తొలగించారని లేఖలో పేర్కొన్నారు.
రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాటును అందించానని సుయెల్లా బ్రేవర్మన్ తెలిపారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని ఎన్నికల్లో బ్రిటన్ ప్రజలకు ఇచ్చిన హామీలను రిషి సునాక్ మరిచిపోయారని విమర్శించారు. కీలకమైన విధానాల అమల్లోనూ ఆయన విఫలమయ్యారని.. ప్రజా సంక్షేమాన్ని పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి పదవికి రిషి సునాక్ అనర్హుడంటూ లేఖలో బ్రేవర్మన్ పేర్కొన్నారు.