తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కీలక దశ ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన రాష్ట్రం ఇవాళ్టితో మూగబోనుంది. ఓవైపు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు.. మరోవైపు బీఎస్పీ, మజ్లిస్, వామపక్షాలు ఇలా రాష్ట్రంలో ప్రచారం జోష్‌గా సాగింది.
విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించిన ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్నందున.. ఓటింగ్‌కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారించి.. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు నిఘా మరింత పటిష్టం చేస్తారు.