గత రెండు రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణ బోర్డు కు మరియు కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీటి విడుదల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు బలగాల మొహరింపు నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారుల తో ఆన్లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
గత నెల 29వ తేదీన ఏపీ పక్షపాతంగా సాయుధ దళాలను మొహరించి సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల చేయడంతో… తలెత్తిన వివాదంపై బల్ల సమీక్షించారు. గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఆయన ఏపీని కోరారు. డాన్ నిర్వహణ తాత్కాలికంగా సిఆర్పిఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక కేంద్రం ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రికి నాగార్జునసాగర్కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. దీంతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడింది.