తెలంగాణలో సింగరేణి ఎన్నికలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ (సీఎల్సీ) డి.శ్రీనివాసులు సోమవారం సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో హైదరాబాద్లోని కార్మికశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మూడు నెలల క్రితం హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 27న ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ డి.శ్రీనివాసులు ప్రకటించారు. తాజా ఓటర్ల జాబితాను కార్మిక నేతలకు అందజేసిన ఆయన.. మొత్తం 39,748 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్టోబరు 30 నుంచి సింగరేణి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి.. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలవడంతో సింగరేణి ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది.