అప్ఘానిస్థాన్లో కొలువైన తాలిబన్ ప్రభుత్వం ఆంక్షల పేరుతో ప్రజలను ఎంత ఇబ్బందులు పెడుతుందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలపై విపరీతమైన ఆంక్షలు విధించింది. వారి నుంచి విద్యతో పాటు ఎన్నో అవకాశాలను దూరం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అఫ్గానిస్థాన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అఫ్గానిస్థాన్ సరిహద్దు మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కోసం నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న మహమ్మద్ అబ్బాస్ తాలిబన్లకు ప్రజలు దూరం కావడానికి మహిళల విద్యపై ఆంక్షలు విధించడమే కారణమని వ్యాఖ్యానించారని టోలో అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. బాలికల విద్య కోసం పాఠశాలను తిరిగి తెరవాలని, జ్ఞానం లేని సమాజం చీకటితో సమానమని ఆయన అన్నట్లు వెల్లడించింది. దేవుడు ప్రజలకు కల్పించిన సహజమైన హక్కు విద్య అని దాన్ని ఎలా దూరం చేయగలరని ప్రశ్నించారు దీన్ని అతిక్రమిస్తే అది అఫ్గానిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు.