తెలంగాణ ఆర్టీసీలో ఒక్క రోజే అర కోటి మంది ప్రయాణం

-

తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే మొదటగా మహాలక్ష్మీ పథకం అమలును ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఫ్రీ ప్రయాణంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది.

ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రోజున రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. ఏకంగా 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) మునిశేఖర్‌ వెల్లడించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగినట్లు ఆయన తెలిపారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారని వివరించారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ రెగ్యులర్‌తో పాటు స్పేర్‌ బస్సులను నడిపించామని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news