పార్టీ కార్యకర్తల త్యాగాల్ని తాను ఎన్నటికీ మరవబోనని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తనను ఇబ్బంది పెట్టినా సహించానని, కానీ తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదలను అంటూ హెచ్చరించారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఈ సందర్భంగా వచ్చిన కుప్పం నియోజకవర్గ నేతలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల అశాంతి, హింసా సంస్కృతి మొదలయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ వేధింపులు పెచ్చుమీరాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. తనను ఇబ్బంది పెట్టేందుకు, పార్టీ నాయకుల్ని భయపెట్టేందుకు జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలపై కూడా అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిందని అయినా వారు ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు. వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని.. కార్యకర్తల త్యాగాలు మర్చిపోను అని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.