రాష్ట్ర మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడవటం లేదు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు రూట్ సర్వే చేశారు. ఈ విషయంపై వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్‌ను వివరణ కోరగా ఆ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించేందుకు సర్వే చేశారని చెప్పారు. త్వరలో బస్సు నడిపిస్తామని తెలిపారు. పత్తిపల్లి – పొట్లాపూర్ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ విషయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఊరుకు బస్సు వస్తుండటంపై ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.