పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం రోజున లోక్సభలో ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని నియమించింది.
ఈ కేసు దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేయాలని లోక్సభ సచివాలయం కోరింది. కమిటీకి సీఆర్పీఎఫ్ డీజీ అనీశ్ దయాల్ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు లోక్‌సభలోకి దూకిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే దుస్సాహసానికి పాల్పడినట్లు సమాచారం.