అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా జో బైడెన్ అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేశారు. కుటుంబసభ్యుల వ్యాపారాల విషయంలో బైడెన్ అవినీతి లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు బయటపడకపోయినా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహం మేరకు రిపబ్లికన్ పార్టీ ప్రజా ప్రతినిధులు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు.
సెనేట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలిగించవచ్చు. ఇందుకు సుధీర్ఘ సమయం పడుతుంది. అయితే వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బైడెన్ ఆ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటే ఇది ఆయనకు ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న విషయం తెలిసిందే.