2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదే : సీఎం రేవంత్ రెడ్డి

-

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు దారుణంగా నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళణకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శనివారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి శాసనమండలిలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై శాసనసమండలిలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. నిరుద్యోగులంతా సర్కారు కొలువుల కోసం పకడ్బందీ ప్రణాళికలు చేసుకుని ప్రిపేర్ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news