శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18వ తేదీన సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేద తీరుతున్నారు. ఐదు రోజుల పాటు నగరంలోనే ఉండనున్న రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం రోజున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. ఇక ఈరోజు ద్రౌపది ముర్ము బిజీబిజీగా తన షెడ్యూల్ గడపనున్నారు.
నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించనున్నారు. చేనేత కార్మికులతో సమావేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖీలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.