తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగనున్నారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో 20 మంది పోలీస్ ఉన్నతాధికారులను మంగళవారం రోజున బదిలీ చేసిన ప్రభుత్వం.. డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో డీజీపీ(హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్-హెచ్‌వోపీఎఫ్)గా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజాగా బదిలీల ప్రక్రియలో రవి గుప్తానే రాష్ట్ర డీజీపీగా కొనసాగించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆయన్ని డీజీపీ(సమన్వయం)గా నియమిస్తూ.. డీజీపీ(హెచ్‌వోపీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీపీగా ఆయనే కొనసాగనున్నారు. వెయిటింగ్‌లో ఉన్న పూర్వ డీజీపీ అంజనీకుమార్, సీవీ ఆనంద్, వి.సత్యనారాయణలకూ కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, పలువురు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.