వైకాపాలో తిరుగుబాటు మొదలయ్యిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. తనకు తానే గొప్ప వ్యక్తిగా, మహానుభావుడిగా ఊహించుకుంటూ… పార్టీ ఎమ్మెల్యేలు పనికిరన్నట్టుగా వారిగా తీసేస్తున్నాం, వీరిని మార్చేస్తున్నామని అంటే ఎవరు మాత్రం సహిస్తారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించక ముందే, మూడు, నాలుగు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికైన వారు, మంత్రులుగా పని చేసిన వారు ఉన్నారన్నారు.
ముందు వచ్చిన చెవులను వెనక వచ్చిన కొమ్ములు వెక్కిరించినట్లుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. బెంగళూరులో తమ పార్టీకి చెందిన 40 మంది ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసిందన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులంతా తిరుగుబాటు సిద్ధమవుతున్నారని చెప్పారు. వైకాపాలో భూకంపం మొదలయ్యిందని, గతంలో వాడితో మాట్లాడేది ఏందీ… వీడ్ని చూసేది ఏందీ ? అనేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రతి ఒక్కరిని బ్రతిమాలే పరిస్థితిలోకి జగన్ మోహన్ రెడ్డి గారు నెట్టి వేయబడ్డారన్నారు. పార్టీలో నెలకొన్న భూకంప ప్రకంపనలు ప్యాలెస్ ను కూడా తాకాయని తెలిపారు.