భారీ వర్షాలు, వరదలు కాంగోలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాలతో ఆ దేశం అస్తవ్యస్తం అవుతోంది. అక్కడి ప్రజల జనజీవనం వర్షాల వల్ల స్తంభించిపోయింది. వరదల ధాటికి కాంగోలో ఇప్పటి వరకు 22 మంది మరణించారు. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన విపత్తు సహాయక దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
మంగళవారం రోజున కాసాయ్ సెంట్రల్ ప్రావిన్స్‌లో వరదల ధాటికి 22 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు, చర్చ్‌లు, రోడ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. వరదల్లో పలువురు గల్లంతైనట్లు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో గోడలు కూలి పలువురు మృతి చెందినట్లు కనంగా మేయర్ రోస్ మువాది ముసుబే వెల్లడించారు. డిసెంబర్ తొలి వారంలోనూ కాంగోలోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల వల్ల 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.