ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ కాలంలో పెళ్లి చేయడం కాస్త ఈజీగానే మారింది కానీ ఇళ్లు కట్టడమే చాలా కష్టంతో కూడుకున్నది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఇళ్లు కట్టాలంటే మూటలు కావాల్సిందే.
ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలంటే కనీసం అరకోటి కావాల్సిందేనని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ‘అఫర్డబుల్ ఇండెక్స్’ చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఈ ఇండెక్స్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలకు సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. తొలి స్థానంలో ముంబయి ఉంది. ఆదాయంలో ఇంటి రుణం నెలవారీ కిస్తీ (ఈఎంఐ)కి చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచీని రూపొందించింది. హైదరాబాద్‌లో 2023లో ఇళ్ల ధరలు 11% పెరిగినట్లు ‘అఫర్డబుల్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది.