కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ చేసింది.
జై హింద్ ఛానల్‌లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో సీబీఐ కోరింది. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, దిల్లీలోని ఫ్లాట్లో రూ.8 కోట్ల పైచిలుకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనకు జైహింద్ ఛానల్‌లో వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం, ఆస్తి వివరాలలో ఆయన ప్రకటించారు. తాను జైహింద్ ఛానల్‌లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదన, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపించారు.