తెలంగాణలో ఈ నెల 18 నుంచి ‘వింగ్స్ ఇండియా-2024’ ప్రదర్శన జరుగనుంది. అయితే.. ఈ నెల 18 నుంచి 21 వరకు బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్న వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమ ఏర్పట్ల పై భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్‌ను సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షీంచారు.
వివిధ తయారీదారులు, అనుబంధ విమానయాన సేవలు, అనుబంధ విభాగాలు, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు చెందిన కొన్ని కొత్త తరం విమానాల ప్రదర్శనతో పాటు వివిధ దేశాలు, ఇతర ఉన్నత స్థాయి ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ సంవత్సరం ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమానికి చివరి రెండు రోజుల్లో లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. బేగంపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనుల పై శ్రద్దవహించాలని GHMC అధికారులను ఆదేశించారు.