ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం నిధుల కేటాయింపు, సద్వినియోగంపై వారికి దిశానిర్దేశం చేశారు.
ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తాం. నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలి. ప్రతి శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దు. అని ఈ ఐదు జిల్లాల ఇంఛార్జ్‌లకు, ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.