సంక్రాంతి పండుగకు హైదరాబాద్ మహానగరమంతా సొంతూళ్లకు పయనమవుతోంది. ఇదే అదనుగా కొన్ని దొంగల ముఠాలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడేందుకు ప్లాన్ వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నగరవాసులకు సూచనలు జారీ చేశారు. సొంతూళ్లకు వెళ్లే కుటుంబాలు ఇళ్లల్లో చోరీలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కొత్తపల్లి నరసింహ సూచించారు.
పోలీసులు ప్రజలకు సూచించిన జాగ్రత్తలు ఇవే..
బంగారు, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని లేదంటే వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకోవాలని చెప్పారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలని.. చక్రాలకు గొలుసులతో తాళం వేయాలని సూచనలు జారీ చేశారు. అపార్ట్‌మెంట్ల దగ్గర , ఇంట్లో సీసీకెమెరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చూడాలని చెప్పారు.
- ఇంటి ముందు చెత్తాచెదారం, దిన పత్రిక, పాలప్యాకెట్లు జమవ్వకుండా చూడాలి. వాటిని చూసి ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి దొంగలు చోరీ చేసే అవకాశం ఉంది.
- మెయిన్ డోర్ కు తాళం వేసినా కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలి. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచాలి.
- ఇంటి వెనుకభాగంలో తలుపులు మూసి కేవలం బోల్టులతోనే సరిపెట్టకుండా.. తాళం వేయాలి.