అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన వేళ.. కేంద్రమంత్రులకు ప్రధాని కీలక సూచనలు

-

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీ అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక జరగనుంది. ఈ వేడుకకు అతిరథమహారథులు, రామయ్య భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఈ మేరకు అయోధ్యను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవం వేళ కేంద్ర మంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. గత కేబినెట్‌ సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చిందని, ఈ సందర్భంగా మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ మంత్రులంతా విధేయతా, భక్తిభావంతో మసులుకోవాలని, దుందుడుకు ప్రవర్తనకు దూరంగా సంయమనంతో వ్యవహరించాలని మోదీ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వేళ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ గౌరవం ఇనుమడింపజేసేలా నడుచుకోవాలని సూచించినట్లు తెలిసింది. తమ నియోజకవర్గాల్లో సామరస్యపూరిత వాతావరణానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news