అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన జరగబోయే ఈ మహత్తర కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే రాముడి జన్మించిన అయోధ్యలో రామ్ మందిర్తో పాటు చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కనక భవన్. సీతాదేవి వ్యక్తిగత ప్యాలెస్ ఇది అని పూర్వీకులు చెబుతుండేవారని అయోధ్య వాసులు అంటున్నారు.
నగరానికి ఈశాన్యంలో గల ఆ భవంతిని అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా సీతాదేవికి ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఆ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్‌గా ఉండేదట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దానిని ఆధునికీకరించాడని అయోధ్య వాసులు చెబుతున్నారు. అనంతరం విక్రమాదిత్యుడు తిరిగి నిర్మించాడని తెలిపారు. తదుపరి ఓర్చా మహారాణి వృషభాను కున్వారీ ఆ భవనానికి మరమ్మతులు చేయించడంతో ఓర్చా రాజవంశీకులే తరతరాలుగా ఆ భవన నిర్వహణను చూసుకుంటున్నారు. ఆ మహల్‌లో సీతారాముల విగ్రహాలు పూజలందుకొంటున్నాయి. ఆ భవనం గోడల నుంచి కాలి పట్టీల మువ్వల శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.