భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ‘‘హర్‌హర్ మౌసం.. హర్‌ఘర్ మౌసం’’ (ప్రతి ఒక్కరికీ.. ప్రతి ఇంటికీ వాతావరణ సమాచారం) పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం రోజున దిల్లీలో విడుదల చేశారు.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోనూ ఈ యాప్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఈ యాప్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా ప్రతి రోజు…. తర్వాత వచ్చే అయిదు రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుసుకోచ్చని చెప్పారు. తుపాన్లు, భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ముందుగానే తెలియడం వల్ల విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటి వ్యవసాయ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందించుకోవడం సులువవుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉందని చెప్పారు.