తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం గ్యారంటీల్లో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు అందాయి. రేషన్ కార్డుల కంటే ఎక్కువగా ఈ పథకానికే దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పథకం కింద 91,49,838 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అభయహస్తం పథకాల అమలుకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 89.98 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. రూ.500కు గ్యాస్ సిలిండర్‌కు వచ్చిన దరఖాస్తులు అంతకంటే ఎక్కువ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 4.2 లక్షల మంది ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా గ్యాస్ రాయితీని వదులుకుంటున్నారు.
మొత్తం గ్యాస్ వినియోగదారుల్లో 44 శాతం మంది మాత్రమే నెలకోసారి రీఫిల్ చేయించుకుంటున్నారు. రేషన్‌కార్డు ఉన్న పేద కుటుంబాలు సగటున రెండు నెలలకు ఓ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏడాదికి ఆరు సిలిండర్లను రూ.500 చొప్పున ఇస్తే రాష్ట్ర సర్కారుపై ఏటా సుమారు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు.