మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించింది. అయితే దీనికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ససేమిరా అన్నారు. అసలేం జరిగిందంటే?
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థకు ఆదాయం పెంచేందుకు మేడారం, ఇతర జాతరలకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో మహిళలకు కూడా టికెట్ ఛార్జీలు వసూలు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను ఉంచారు. అయితే భట్టి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మేడారం సహా ఏ జాతరకు మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని, ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.