పాకిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. గత మూడు వారాల్లో న్యుమోనియా కారణంగా 200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పంజాబ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. అతిశీతల వాతావరణం కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహార లోపం ఉన్నవారేనని తెలిపింది. అంతే కాకుండా న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారు మరణించినట్లు పేర్కొంది.
స్థానిక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రాకరం.. పంజాబ్ ప్రావిన్సులో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఇందులో 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఐదేళ్ల లోపు పసిపిల్లలే. లాహోర్‌లోనే 47 మంది చనిపోయారు పంజాబ్ ప్రావిన్సులో గతేడాది 990 మంది న్యుమోనియాతో చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. పిల్లల వరుస మరణాలు అక్కడి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లలను ఎలాగైనా కాపాడాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.