హైదరాబాద్లో కరెంట్ కోతలతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 గంటల కంటే ఎక్కువ సేపు కోత పెట్టడంతో అవస్థలు పడుతున్నారు. వేసవి సన్నద్ధతలో భాగంగా హైదరాబాద్లో చేపట్టిన విద్యుత్తు మరమ్మతులపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఉపకేంద్రాల నిర్వహణ దగ్గర్నుంచి లైన్ల మరమ్మతుల వరకు ఏదైనా రెండు గంటలు మించకూడదని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు.
మూడు గంటలపాటు విద్యుత్తు ఉండదని విద్యుత్ అధికారులు అధికారికంగానే ప్రకటిస్తున్నారు. సీఎండీతోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈవిషయాన్ని స్పష్టం చేస్తూ షెడ్యూల్ రూపొందించుకోవాలని ఆదేశించినా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గంటలు కరెంట్ కట్ చేస్తున్నారు. హయత్‌నగర్ బొమ్మలగుడితో పాటు పలు కాలనీల్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల దాకా విద్యుత్ సరఫర నిలిచింది. సనత్‌నగర్‌లో ఐదు రోజుల క్రితం నాలుగు గంటలకుపైగా విద్యుత్తు లేదని స్థానికులు వాపోతున్నారు.