తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ దరఖాస్తుల వడపోత ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ ఇందుకోసం కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించనుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని, స్థలం లేనివారికి స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమల్లో భాగంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను, రెండింటి కోసం వచ్చిన దరఖాస్తులను వేరుచేస్తున్నారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దరఖాస్తు చేశారో తెలుసుకునేందుకు దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.