భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్-3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ-47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాహకనౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్-3 అంతరిక్షంలోకి వెళ్లింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి, తీర ప్రాంత భద్రత తదితర అంశాల్లో ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది.
ఈ ఉపగ్రహం ద్వారా ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా తీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని జీవితకాలం ఐదేళ్లు ఉంటుందని, బరువు 1,625 కిలోలని తెలిపారు. ఇక ఇదే వాహకనౌక ద్వారా అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగించిన తరువాత 26.50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్ష్యల్లో ప్రవేశపెట్టింది రాకెట్. చంద్రయాన్-2 విఫలమైన తరువాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే కావడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.