ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పోటెత్తారు. జాతరలో మూడో ఆదివారమైన నేడు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి పట్నాలు , బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. కొండపై ఉన్న ‘మల్లన్న’ తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున తరలి వచ్చిన భక్తులతో కొమురవెళ్లి ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న గుడికి కూడా భక్తులు బారులు తీరారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లే ముందు వేములవాడ, కొండగట్టు ఆలయాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మేడారం జాతర సమీపిస్తున్నందున భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం సమ్మక్క జాతరకు వెళ్తున్నారు.