మేం పదవుల్లో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము రాజీనామా చేసి బయటకు వచ్చిన 3 నెలలకు పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నామని తెలిపారు. తాము పదవుల కోసం పెదవులు మూసుకోలేదని వ్యాఖ్యానించారు. పదవులు కోసం పెదవులు మూసుకున్నది.. పార్టీల మారిన చరిత్ర సీఎం, మంత్రులది అని చెప్పారు. కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజమెత్తారు.
“పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ హయాంలో 13-9-2005న జీవో తెచ్చారన్న హరీశ్ రావు.. ఆ ప్రాజెక్టు కోసం వైఎస్ హయాంలో మరోసారి 19-12-2005 జీవో తెచ్చారని చెప్పారు. తాము 2005 జులై4, 2005న వైఎస్ సర్కారు నుంచి బయటకువచ్చాం. మేం రాజీనామా చేసి బయటకు వచ్చిన 3 నెలలకు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. మేం పదవుల కోసం పెదవులు మూసుకోలేదు. అవును.. అప్పుడు పీజేఆర్ ఒక్కరే తెలంగాణ కోసం మాట్లాడారు. అప్పట్లో రేవంత్ రెడ్డి టీడీపీలో పెదవులు మూసుకుని ఉన్నారు. పోతిరెడ్డిపాడు జీవోకు వ్యతిరేకంగా 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం.” అని హరీశ్ రావు తెలిపారు.