మాజీ ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. కూలిస్తే కూలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో అంతర్యుద్ధం జరగడం లేదని, బీఆర్ఎస్ లో మాత్రం త్వరలోనే జరిగి తీరుతుందని అన్నారు. కేసీఆర్కు వెన్నుపోటు పొడవడానికి హరీశ్ రావు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి రావొచ్చని జోస్యం చెప్పారు. రాజకీయంగా బీఆర్ఎస్ నేర్పిన విద్యనే.. ఆ దారిలోనే తామూ ప్రయాణం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వమేమీ నాసిరకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూలిపోవడానికని అన్నారు.
“నన్ను మించిన వారు లేరని కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. సంగారెడ్డిలో హరీశ్ రావు రూ.60 కోట్లు పంచారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా వెళ్లి కలిశారా? అదే కాంగ్రెస్లో ఎవరైనా వెళ్లి సీఎంను కలిసే అవకాశం ఉంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.