గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి భారమని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామని తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశామని వెల్లడించారు.
“గత సర్కార్ హడావుడిగా, ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. గత సర్కార్ చేసిన తప్పులతో ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఇతర అవసరాలను తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ వల్లే జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట, ఇది నిజమేనని తేలింది. అందుకే ఈ సమస్యకు మేం అధిక ప్రాధాన్యమిస్తున్నాం.” అని భట్టి విక్రమార్క అన్నారు.