భారత్ లో గతేడాది మరణశిక్షలు పెరిగినట్లు దిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తెలిపింది. గడచిన రెండు దశాబ్దాలలో ఏ ఒక్క సంవత్సరంలోనూ లేనంతగా 2023లో దేశంలో 561 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. 2023లో కొత్తగా 120 మందికి దిగువ కోర్టులు మరణ శిక్షలు విధించినట్లు పేర్కొంది. వీరిలో అత్యధికులు లైంగిక నేరాలకు పాల్పడినవారే ఉన్నారని చెప్పింది.
దేశంలో మరణ శిక్షలపై వార్షిక గణాంకాల నివేదికను విశ్వవిద్యాలయం ప్రచురించింది. గతేడాది దిగువ కోర్టులు 120 మందికి మరణ శిక్షలు విధించినా, అప్పిలేట్ కోర్టుల్లో ఒక్క కర్ణాటక హైకోర్టు మాత్రమే ఒక వ్యక్తికి మరణ శిక్షను నిర్ధారించిందని ఈ నివేదిక వెల్లడించింది. మరణశిక్ష పడిన 488 మంది వివిధ హైకోర్టులలో విముక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఏ ఒక్కరికీ మరణ శిక్షను ఖరారు చేయలేదని.. గత ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యధికంగా 33 మందికి మరణ శిక్షలు విధించారని పేర్కొంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహిత బిల్లు మరణ శిక్ష విధించదగు నేరాల సఖ్యను 12 నుంచి 18కి పెంచాలని ప్రతిపాదిస్తోంది. మరణ శిక్షలను యావజ్జీవ కారాగార శిక్షలుగా తగ్గించే అవకాశాలనూ పరిమితం చేస్తోంది.