రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో జన సముద్రం కన్పిస్తోందన్నారు.ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని ముఖ్యమంత్రి జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా తగ్గడానికి వీలు లేదు. పచ్చ మీడియా, ప్యాకేజీ స్టార్ సరిపోరంటూ.. జాతీయ పార్టీల్లో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారు. నా ఒక్కడితో యుద్ధం చేసేందుకు తోడేళ్లన్నీ ఏకం అవుతున్నాయి. వీళ్లని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సాయంగా నిలబడాలి’ అని కోరారు.
మరో 55 రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని ,వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 సీట్లు మన లక్ష్యం అని తెలిపారు. 25 ఎంపీ సీట్లకు 25 మన టార్గెట్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సైన్యంగా పనిచేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని ,ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కనిపించవని అన్నారు.