రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే యువత తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో క్రీడా, సినీ, సాహిత్య రంగాలతో పాటు ఇన్‌స్టాగ్రామ్, య్యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్‌సర్లు చొరవ చూపి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. యువతను పోలింగ్ బూత్ వైపు వెళ్లేలా ప్రభావితం చేయాలని సూచించారు.
110వ మన్ కీ బాత్‌లో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతి రంగంలో నారీశక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని అన్నారు. గ్రామాల్లో నివసించే మహిళలు కూడా డ్రోన్‌లను ఎగురవేస్తారని, కొన్నేళ్ల క్రితం వరకు ఎవరు ఊహించి ఉండరన్న మోదీ.. ఏ రంగంలో కూడా వనితలు వెనుకబడి లేరని తెలిపారు. కొన్ని రోజుల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నామని గుర్తు చేసిన ప్రధాని దేశాభివృద్ధికి మహిళలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు అదొక అవకాశమని వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నందున మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలు మన్ కీ బాత్ ఉండదని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.