కుంకుమపువ్వు అనగానే, చాలా మందికి గర్భవతులకే ప్రత్యేకమైనది అనే ఆలోచన వస్తుంది. కానీ, ఈ బంగారు వర్ణపు సుగంధ ద్రవ్యం కేవలం ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు, చిన్నారి బాలికల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల మహిళల ఆరోగ్యానికి, అందానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అరుదైన గుణాలు కలిగిన ఈ ఖరీదైన ‘ఎరుపు బంగారం’.. మహిళల జీవితంలో ఎదురయ్యే పలు కీలక ఆరోగ్య సమస్యలకు, హార్మోన్ల సమతుల్యతకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
కుంకుమపువ్వు (Saffron) లో క్రోసిన్ (Crocin) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మహిళల ఆరోగ్యానికి బహుముఖంగా ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు: నేటి మహిళలు ఉద్యోగ, కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడి ఆందోళన కు లోనవుతున్నారు. కుంకుమపువ్వులో ఉండే సహజ గుణాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచి, సహజ యాంటీ-డిప్రెసెంట్‌లా పనిచేస్తుంది. తద్వారా నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి.
చర్మ సౌందర్యం (Skin Health): కుంకుమపువ్వును పాలలో కలిపి తీసుకున్నా లేదా ఫేస్ ప్యాక్‌గా వాడినా, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి.

రుతువిరతి లక్షణాల ఉపశమనం: మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి ఆవిర్లు, మూడ్ మార్పులు, నిద్ర సమస్యలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, ఈ దశను సులభంగా దాటేందుకు తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగు: కుంకుమపువ్వులో ఉండే క్రియాశీలక సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తి, దృష్టి: వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో వచ్చే జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యల నివారణకు కంటి చూపు మెరుగుదలకు కూడా కుంకుమపువ్వు ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, కుంకుమపువ్వును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
కుంకుమపువ్వు కేవలం ఖరీదైన సుగంధ ద్రవ్యం కాదు, ఇది మహిళల జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్యానికి, అందానికి మానసిక ప్రశాంతతకు తోడ్పడే అద్భుతమైన ఆయుర్వేద వరం.
గమనిక: కుంకుమపువ్వును పరిమితంగా (రోజుకు 2-3 పోగులు) మాత్రమే వాడాలి. అధిక మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు ఉండవచ్చు.