హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మక 21వ బయో ఆసియా సదస్సు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తొలిరోజైన ఈరోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు. 27వ తేదీన ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, ఆచార్య గ్రెగ్ ఎల్ సెమెంజాకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్ పురస్కారాన్ని అందజేయనున్నారు. 28న పలు చర్చాగోష్ఠిలతో పాటు ముగింపు సమావేశం ఉంటుంది. 700కి పైగా వినూత్న అంకుర సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శనకు పోటీపడ్డాయి. వాటిలో నుంచి నిపుణులు 70 అంకుర సంస్థలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో ఐదింటిని తుది జాబితాకు ఎంపిక చేసి, సదస్సు ఆఖరి రోజున ప్రత్యేక పురస్కారాలను అందజేస్తారు.