ఎన్డీఏ సర్కార్ మూడో విడత ప్రభుత్వం జూన్‌లో ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడో విడతలో తమ పనితీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసేలా మరింత వేగంగా ఉంటుందని తెలిపారు. రైల్వేలకు సంబంధించి 41 వేల కోట్ల విలువైన 2వేల ప్రాజెక్టుల పనులను ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశంలోని 554 రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనుల్ని ప్రారంభించారు.
ఈ జాబితాలో ఏపీలో 46, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.ఏపీలో 84 ఆర్ఓబీలు , అండర్‌పాస్‌లు, తెలంగాణలో 48 ఆర్ఓబీలు, అండర్‌పాస్‌ల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. రైల్వే రంగంలో వస్తున్న మార్పులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పిన ప్రధాని వందే భారత్ వంటి రైళ్ల గురించి గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని తెలిపారు. పదేళ్ల నుంచి. నూతన రైల్వే ప్రాజెక్టుల పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని వెల్లడించారు. గతంలో రైల్వేలు రాజకీయాలకు బాధిత వ్యవస్థగా మారాయని ఆరోపించిన మోదీ.. తమ హయాంలో సుఖవంతమైన ప్రయాణానికి, ఉపాధికి మార్గంగా మార్చామని అన్నారు.