మ్యారేజ్ ప్రపోజల్ మొదలై అది కార్యరూపం దాల్చకపోతే దానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెళ్లి ప్రతిపాదన వివాహం అయ్యే వరకు దారితీయకపోతే అది మోసం కిందకు రాదని పేర్కొంది. ఓ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించి కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన ఛీటింగు కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ఆరోపణ కింద నేరం రుజువు చేయాలంటే మోసం చేయాలనే ఉద్దేశం మొదటి నుంచీ ఉండాలనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం పదే పదే చెబుతోందని గుర్తు చేసింది.
తనను పెళ్లి చేసుకోకుండా రాజు అనే వ్యక్తి మోసం చేశాడంటూ కర్ణాటకకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం నిశ్చయమైన తర్వాత తామిద్దరం ఫోనులో మాట్లాడుకున్నామని కల్యాణ మండపం కోసం తన తండ్రి రూ.75 వేలు అడ్వాన్సు ఇచ్చారని చివరకు రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సెక్షన్ 417 కింద నమోదైన ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు.. కేవలం రాజును దోషిగా తేల్చడంతో ఈ తీర్పును సవాలు చేస్తూ రాజు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారించిన జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ప్రసన్నా బి.వరాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది.